అమెరికా గూఢచర్యం వార్తలపై సారీ చెప్పిన ఒబామా.. ఎవరికి?

బుధవారం, 26 ఆగస్టు 2015 (13:36 IST)
జపాన్‌ ప్రభుత్వ అధికారులపై అమెరికా గూఢచర్యానికి పాల్పడిందంటూ వికీలీక్స్ వెల్లడించిన పత్రాలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ దేశానికి సారీ చెప్పారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా వెల్లడించారు. 
 
ఈ గూఢచర్యం వార్తలపై తమ దేశ ప్రధానమంత్రి షింజో అబేతో ఒబామా బుధవారం ఉదయం ఫోనులో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. వికీలీక్స్ కథనం తర్వాత జపాన్‌లో నెలకొన్న చర్చ, ప్రజల మనోభావాలు దెబ్బతినడంపై అధ్యక్షుడు చింతిస్తున్నట్టు తెలిపారు. ఇదేసమయంలో గూఢచర్యం తీవ్రమైనదని షింజో అబే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారని తెలిపారు. 
 
ఈ సందర్భంగా షిజో కూడా ఒబామాతో ఈ తరహా వార్తలు ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అన్నారని సుగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ, సంవత్సరాలుగా జపాన్ అధికారులు, పెద్ద పెద్ద కంపెనీలపై గూఢచర్యం చేస్తోందని గత నెలలో వికీలీక్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి