భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా, దేశాభివృద్ధి కోసం చేసే ఆలోచనల్లో తామిద్దరం నవ యువకులం అని చెప్పుకొచ్చారు.
తన భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో ప్రధాని మోడీతో కలిసి ఐక్రియేట్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య స్నేహం చరిత్రలో మానవత్వానికి కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి ఉపయోగకరమైనవి తయారుచేసే విభాగంలో తమకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఐక్రియేట్ సెంటర్ లాంటివి దేశంలో ఇంకా చాలా ప్రారంభం కావాలని మోడీ అన్నారు.
దేశంలోని వ్యవస్థను ఆవిష్కరణలకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నిస్తున్నామని, కొత్త ఆలోచనల ద్వారా కొత్త ఆవిష్కరణలు వస్తాయని, ఆవిష్కరణల నుంచి కొత్త భారత్ అవతరిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఇక్కడి యువత శక్తి, ఉత్సాహం కలిగి ఉన్నారు. వారికి కాస్త ప్రోత్సాహం, సలహాలు, సంస్థాగత మద్దతు ఉంటే చాలని అన్నారు.
అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ, మోడీ, తాను ఆలోచనల్లో యువకులం అని, భవిష్యత్తు పట్ల ఆశావాదులం అని అన్నారు. ఐప్యాడ్, ఐఫోన్ తర్వాత ఐక్రియేట్ గురించి మాట్లాడుకుంటారన్నారు. మోడీ తన నాయకత్వంతో దేశాన్ని మార్చుతున్నారన్నారు. భారతీయ యువత ఇజ్రాయెల్ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జై హింద్, జై భారత్, జై ఇజ్రాయెల్ అంటూ మోడీకి, అందరికీ ధన్యవాదాలు చెప్పి ప్రసంగం ముగించారు.