ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ నిబంధనలను పక్కనబెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. నెతన్యాహును మోదీ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి సారా నెతన్యాహు కూడా ఉన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి మన దేశానికి రావడం 15 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి. పదిహేనేళ్ళ క్రితం 2003లో ఆ దేశ ప్రధాని ఏరియల్ షరాన్ మన దేశానికి వచ్చారు. నెతన్యాహు ప్రయాణించిన విమానంపై భారతదేశం, ఇజ్రాయెల్ దేశాల జాతీయ పతాకాలు ఉన్నాయి. నెతన్యాహు మన దేశంలో 6 రోజులపాటు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరాటం, వ్యాపార సంబంధాల బలోపేతం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి.