బ్రూనై వివాదాస్పద నిర్ణయం.. స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి?

శుక్రవారం, 29 మార్చి 2019 (17:17 IST)
ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నేరాలు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని తీర్మానించింది. ముఖ్యంగా వివాహేతర సంబంధం పెట్టుకునే వారిని, స్వలింగ సంపర్కులను లక్ష్యం చేసింది. వాళ్లను రాళ్లతో కొట్టి చంపేయాలని నిర్ణయం తీసుకుంది.


షరియా చట్టాల ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో శిక్షలను వచ్చే వారం నుండి అమలులోకి తేనున్నట్లు వెల్లడించారు. 
 
అదే విధంగా దొంగతనాలకు పాల్పడే వారికి కూడా శిక్షలను కేటాయించారు. కాళ్లు, చేతులు నరికేయాలని తీర్మానించారు. మొదటిసారి దొంగతనం చేస్తే కుడి చేతిని, రెండోసారి కూడా అదే తప్పు పునరావృతం చేస్తే ఎడమ పాదాన్ని నరికివేస్తారు. ఈ శిక్షను బుధవారం నుండి అమలు చేయబోతున్నామని చెప్పారు. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు. 
 
కాగా ప్రభుత్వ నిర్ణయం, హక్కులను ఉల్లంఘించేలా ఉందని మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ విజ్ఞప్తి చేసింది. ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి బ్రూనేను బహిష్కరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని. 
 
ఆగ్నేయ ఆసియా దేశంలో ఇటువంటి శిక్షలు అమలు చేసే తొలి దేశంగా గుర్తింపు పొందడం ద్వారా వివాదాస్పద దేశంగా బ్రూనైకి ముద్రపడుతుందని. తద్వారా విదేశీ పెట్టుబడులు, పర్యాటకుల సంఖ్య తగ్గి భారీగా ఆదాయం నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బ్రూనై మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని బాగా సమర్థిస్తున్నారు. శిక్షలు తప్పకుండా అమలు అవుతాయని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు