ప్రపంచ కప్‌తో చాలు.. వన్డేల నుంచి క్రిస్ గేల్ రిటైర్మెంట్..

సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:51 IST)
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్.. వన్డేలకు దూరం కానున్నాడు. మేలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ అతడికి చివరి టోర్నీ కానుంది. ఆ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. మెగా టోర్నీ తర్వాత గేల్ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు విండీస్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా క్రిస్ గేల్ వన్డే రిటైర్మెంట్‌ను ధృవీకరించింది.
 
ఇకపోతే.. 39 ఏళ్ల గేల్‌ 1999 సెప్టెంబర్‌లో భారత్‌పై టొరంటో వేదికగా జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డే ఫార్మాట్‌లో బ్రియాన్‌ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేలే.  అంతేగాకుండా వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన (2015 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్ గేలే.
 
20 ఏళ్ల కెరీర్‌ ఉన్నప్పటికీ వెస్టిండిస్ బోర్డుతో విభేదాల కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. గేల్‌ చివరగా 2018 జులైలో వన్డే ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ఆడనున్నాడు. ప్రపంచకప్‌లో బరిలోకి దిగి.. అంతటితో ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 
 
విండీస్ తరఫున 284 వన్డేలు ఆడిన క్రిస్ గేల్ 37.12 సగటుతో 9వేల 727 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ట్వంటీ-20 ఫార్మాట్‌లో క్రిస్ గేల్ కొనసాగుతాడా లేదా అని ఇంకా స్పష్టం కాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు