పాకిస్తాన్ దేశానికి వెన్నుదన్నుగా వుంటూ అడిగినంత డబ్బును సాయం చేస్తూ వస్తున్న చైనా ఒక్కసారిగా ఆ దేశానికి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ దేశంలో తాను చేపట్టే పలు ఆర్థికపరమైన ప్రాజెక్టుల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే బిలియన్ డాలర్ల మేర పాకిస్తాన్ దేశానికి సాయం అందించగా అక్కడ నుంచి తిరిగి చెల్లింపులు వుండటంలేదనీ, కనుక ఇలా సాయం చేసుకుంటూ పోతే పాకిస్తాన్ తమ చేతికి చిప్ప ఇస్తుందని చైనా భయపడి పాక్ ప్రాజెక్టుల నుంచి వైదొలగినట్లు చెపుతున్నారు.
అంతేకాదు... ఇటీవల పాక్ సైన్యాధ్యక్షుడు తాము ఒక స్నేహితుడు(చైనా) కోసం మరో స్నేహితుడు(అమెరికా)ని వదులుకోబోమని అన్నాడు. ఈ వ్యాఖ్యల అనంతరం చైనా ఒకింత అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. దీనితో తాము చేపట్టదలచిన ప్రాజెక్టులకు గుడ్ బై చెప్పేసినట్లు సమాచారం. ఇదిలావుంటే... ప్రపంచ దేశాలపై టారిఫ్ బాదుడు చేస్తున్న ట్రంప్... పాకిస్తాన్ దేశాభివృద్ధికి అవసరమైన సాయం చేస్తామంటూ ప్రకటించడం విశేషం.
పాకిస్తాన్ దేశానికి అవసరమైన ఆయిల్ రిజర్వులను సమకూర్చేందుకు అమెరికా సాయం చేస్తుందనీ, ఫలితంగా ఒకనాటికి ఇస్లామాబాద్ నుంచి భారతదేశం చమురు దిగుమతి చేసుకునే రోజు వస్తుందంటూ ట్రంప్ నాలుక ఆడించారు. ఇవన్నీ కూడా ఇటు భారతదేశానికి అటు చైనాకి అసహనం తెప్పించే వ్యాఖ్యలని వేరే చెప్పనక్కర్లేదు.