తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను మనం తెలుగు సినిమాల్లో చాలా కాలం క్రితమే చూశాం. ఎన్టీరామారావు నటించిన జగదేకవీరుని కథ ఇందుకు ఉదాహరణ. ముని శాపానికి అహల్య రాయిగా మారిన వృత్తాంతమూ చదువుకున్నాం. కానీ భూమ్మీద నిజంగానే అలా తాకగానే శిలగా మార్చేసే ప్రదేశం ఉంది. అదే ఆఫ్రికాలోని టాంజానియాలో గల నాట్రాన్ సరస్సు. అక్కడి నీటిని తాకిన ప్రతి జీవి శరీరంలోని కణ కణాన్ని రాతి శిలగా మార్చేస్తుంది ఈ సరస్సు.
ఈ సరస్సును సందర్శించిన ఓ ఫోటోగ్రాఫర్ నీటిని తాకగానే అక్కడికక్కడే శిలలైపోయిన పక్షులను చూసి షాక్‌కు గురయ్యారు. తనకు కనిపించిన ప్రతి జీవి ఫోటోను కెమెరాలో బంధించారు. శరీరం రాయిగా మారిపోతున్న సమయంలో ఆ పక్షులు పడిన నరకయాతన ఆయన తీసిన చిత్రాల్లో కనిపిస్తుంది. ఈ ఫోటోలన్నీ తన ఫొటో పుస్తకం 'అక్రాస్ ది రవగేడ్ ల్యాండ్'లో పొందుపర్చాడు.
సరస్సు ఇంత ప్రమాదకారిగా మారడానికి కారణం దానికి చేరువలో ఉన్న అగ్నిపర్వతంగా భావిస్తున్నారు. అగ్నిపర్వత అంతర్భాగం నుంచి వచ్చి సరస్సులో కలుస్తున్న సోడియం కార్బోనేట్, సోడియం బై కార్బోనేట్‌ల ప్రభావంతోనే జీవులు శిలలుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా సరస్సు రంగు కూడా లేత గులాబీ వర్ణంలోకి మారిపోయింది. కాగా, సరస్సులోని నీరు ఎప్పుడూ 140 డిగ్రీల వేడితో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.