కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. ఆక్రమిత కాశ్మీర్‌ను పాక్ ఇచ్చేయాలి.. సర్జికల్ స్ట్రైక్సే సరి: కమర్

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:16 IST)
మంగళవారం బండిపురా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. కాల్పులు జరిపిన ఓ ఎల్‌ఈటీ ఉగ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ... ఘటనా స్థలి నుంచి పలు ఆయుధాలు, మందులను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాటి మాటికి కాలు దువ్వుతూ టెర్రరిస్టులను ప్రేరేపిస్తోందని రక్షణ శాఖ నిపుణుడు కమర్ అఘా విమర్శించారు. శాంతియుత పరిష్కారం దిశగా పాకిస్థాన్‌ను దారికి తేవాలంటే సర్జికల్ దాడులే సరైన మార్గమని కమర్ అఘా తెలిపారు. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తీరుకు చెక్ పెట్టాలంటే ఇదే సరైన మార్గమని కమర్ అఘా చెప్పుకొచ్చారు. 
 
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా.. ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ పాకిస్తాన్ ప్రాక్సీ యుద్ధానికి (మారు యుద్ధం) పాల్పడుతోందన్నారు. దీనికి ప్రతిగా భారత్ గట్టినిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. అందులోని కొంతభాగాన్ని కాశ్మీర్ ఆక్రమించిందని చెప్పుకొచ్చారు. అందుచేత పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి శాంతియుతంగా భారత్‌కు అప్పగించాలని చెప్పుకొచ్చారు. ఎలాంటి వివాదం లేకుండా తాము శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు కమర్ పేర్కొన్నారు. ఆ దిశగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచేందుకు సమయం ఆసన్నమైందని అఘా ఉద్ఘాటించారు. 

వెబ్దునియా పై చదవండి