నల్లధనం అరికడతామంటూ భారత కేంద్ర ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు వల్ల రూ.1,000; రూ.500 పెద్ద నోట్లను వ్యవస్థ నుంచి వాక్యూమ్ క్లీనర్ మాదిరిగా వెనక్కి లాగేశారని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే, వాటి స్థానంలో కొత్త నోట్ల సరఫరా మాత్రం నత్తనడకగా సాగిందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎ.కషిన్ అభిప్రాయపడ్డారు. డీమోనిటైజేషన్‌తో దేశంలో తీవ్ర నగదు కొరతకు దారితీసిందని.. ప్రజల వినిమయంపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఆయన అన్నారు. ‘రద్దయిన నోట్లను వ్యవస్థ నుంచి వెనక్కి గుంజేసిన తర్వాత వాక్యూమ్ క్లీనర్ రివర్స్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. కొత్త నోట్ల సరఫరా చాలా నెమ్మదిగా జరిగింది. దీనివల్ల నగదు కొరత తీవ్రతరమై.. వినిమయం తీవ్రంగా పడిపోయింది’ అని ఆయన చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలు ప్రవేశపెట్టిన సహాయ ప్యాకేజీలు ‘హెలీకాప్టర్ డ్రాప్స్’గా (హెలికాప్టర్ ద్వారా నగదు వెదజల్లడం) చాలా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు భారత్‌లో చేపట్టిన డీమోనిటైజేషన్ ప్రక్రియను ‘వాక్యూమ్ క్లీనర్’తో పోల్చవచ్చు’ అని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎ.కషిన్ విశ్లేషించారు. భారత్‌పై ఐఎంఎఫ్ వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు కషిన్ పైవిధంగా స్పందించారు.
ప్రధానంగా దేశీ డిమాండ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో డీమోనిటైజేషన్‌కు ముందు వినిమయం అత్యంత మెరుగైన స్థితిలో ఉండేదని ఆయన పేర్కొన్నారు. కాగా, గడచిన కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న ద్రవ్యపరపతి విధానం, కార్యాచరణ భేషుగ్గా ఉందని కషిన్ చెప్పారు.