ఓటమిని అంగీకరించిని డోనాల్డ్ ట్రంప్... అమెరికా రక్షణ మంత్రిపై వేటు!

మంగళవారం, 10 నవంబరు 2020 (08:31 IST)
అమెరికా అధ్యక్ష పీఠానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. పైపెచ్చు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లతో విజయభేరీ మోగించారు. అయితే, ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదనీ, ఏడు కోట్ల లీగల్ ఓట్లు వచ్చిన తానే విజయం సాధించానని చెప్పుకొచ్చారు. పైపెచ్చు.. అధికార మార్పిడికి ఏమాత్రం సహకరించేలా కనిపించడం లేదు. 
 
ఈ క్రమంలో తన రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించిన ఆయన, "మార్క్ ఎస్పర్‌ను తొలగించాం. ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. ఇకపై రక్షణ మంత్రిగా క్రిస్టొఫర్ మిల్లర్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం మిల్లర్ జాతీయ కౌంటర్ టెర్రరిజం సెంటర్ హెడ్‌గా పనిచేస్తున్నారు. గతంలో ప్రత్యేక సైనిక దళాల అధినేతగానూ సేవలందించారు.
 
గడచిన నాలుగేళ్లలో పెంటగాన్ చీఫ్ ట్రంప్ మార్చడం ఇది నాలుగోసారి. తాజాగా రక్షణ మంత్రి పదవి నుంచి తొలగించబడిన ఎస్పర్ 16 నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయన నిర్ణయాల కారణంగా తనకు రాజకీయ నష్టం సంభవించిందని ట్రంప్ భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 
 
దేశంలో పౌర సమాజం నిరసనలకు దిగుతున్న వేళ, ఫెడరల్ సైనిక దళాలను రంగంలోకి దించాలని ట్రంప్ ఒత్తిడి పెట్టినా, ఎస్పర్ వినలేదు. ఇప్పుడు ఆయన తొలగింపునకు అదే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
ఇకపోతే, అప్ఘనిస్థాన్ నుంచి యూఎస్ సైన్యాన్ని వెనక్కు పిలిపించడం, ఆపై అక్కడ హింసాత్మక ఘటనలు పెరగడం కూడా ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఎస్పర్ తొలగింపు తప్పదని గత కొంతకాలంగా వైట్‌హౌస్ అంతర్గత బృందం అంచనా వేస్తూనే ఉంది. అయితే, ఎన్నికల తరువాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు