ఇది ఇంకా ముగియలేదు... ఓటమిని అంగీకరించను... డోనాల్డ్ ట్రంప్

సోమవారం, 9 నవంబరు 2020 (08:30 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ... తన కథ ఇంకా ముగియలేదని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పైగా, ఈ ఎన్నికల్లో 7 కోట్లకుపై లీగల్ ఓట్లు పోలయ్యాయని, అలాంటపు తాను ఎలా ఓడిపోతానంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ఈ ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిజాయతీగా ఓట్ల లెక్కింపును జరిపేంతవరకు విశ్రమించబోనని స్పష్టంచేస్తున్నారు. 
 
కాగా, హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. అయితే  ఓట్ల లెక్కింపుపై ట్రంప్‌ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నికలను తన నుంచి అక్రమంగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. 'అధ్యక్షుడు ఎవరనేది లీగల్‌ ఓట్లు నిర్ణయిస్తాయి. న్యూస్‌ మీడియా కాదు' అంటూ ఓ ప్రకటన చేశారు.
 
అంతేకాకుండా, 'నిష్పాక్షిక ఎన్నికలు అమెరికా ప్రజల హక్కు. లీగల్‌ ఓట్లను లెక్కించాలని దానర్థం. అక్రమ ఓట్లను లెక్కించడం కాదు' అని ట్రంప్‌ అన్నారు. తమ పరిశీలకులను పోలింగ్‌ కేంద్రంలోకి రానీయలేదని ఆరోపించారు. 'బైడెన్‌ ఏం దాస్తున్నారు? నిజాయతీగా ఓట్లను లెక్కించేంతవరకు నేను విశ్రమించబోను' అని ట్రంప్‌ స్పష్టంచేశారు.
 
మరోవైపు, ఓట్ల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు దేశవ్యాప్తంగా శనివారం ఆందోళనలు చేపట్టారు. 'ఇది ఇంకా ముగియలేదు', '(విజయాన్ని) దొంగిలించడం ఆపండి' అంటూ నినాదాలు చేశారు. పలువురు ఆందోళనకారులు బహిరంగంగానే తుపాకులు చేతబట్టారు. కొన్ని నగరాల్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. రిపబ్లికన్లకు కంచుకోట అయిన జార్జియాలో పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు