అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం... హిల్లరీ చాలా కష్టపడ్డారు.. పాపం బ్యాడ్‌లక్...
బుధవారం, 9 నవంబరు 2016 (14:00 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచి గెలుపు తనదే అంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఆయన తేరుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో ట్రంప్ 276 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. హిల్లరీ 218 ఓట్లతో వెనుకబడిపోయారు. అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 270 ఓట్లు మాత్రమే. దీంతో, అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎంపికయ్యారు. అమెరికాలోని మొత్తం 51 రాష్ట్రాల్లో ట్రంప్ 27, హిల్లరీ 18 రాష్ట్రాల్లో గెలుపొందారు.
తుది ఫలితాలు వెల్లడైన వెంటనే ఆయన విజయోత్సవ ప్రసంగం చేశారు. అమెరికా భవిష్యత్తు కోసం అంతా కలిసి పనిచేయవలసిన సమయమిదేనని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకుందామన్నారు. దేశాన్ని పునర్‌నిర్మించే పనిని సత్వరమే ప్రారంభిస్తానన్నారు. జాతీయాభివృద్ధి కోసం కృషి చేస్తానని, అన్ని దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటాం తప్ప శత్రుత్వాన్ని కాదని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగిసిందని, ఇక అమెరికన్లందరి కోసం పని చేస్తానని చెప్పారు.
తాను అమెరికాలోని ప్రతి ఒక్కరికీ.. ప్రతి ఒక్కరూ గర్వకారణమైన అధ్యక్షుడిగా ఉంటానని ట్రంప్ హామీ ఇచ్చారు. నాలుగు లేదా ఎనిమిదేళ్ల తర్వాత మీరు మంచి పని చేశారని గర్వపడేలా కృషి చేస్తానని తెలిపారు. ఇది చరిత్రాత్మక దినమని అంటున్నారని, కానీ దీనిని చరిత్రాత్మకంగా మార్చాలంటే మనమంతా గొప్పగా పని చేయవలసి ఉందన్నారు. అటువంటి గొప్ప పని తాను చేస్తానని హామీ ఇచ్చారు. తనది ఎన్నికల ప్రచారం కాదని, ఒక ఉద్యమమని తెలిపారు.
అమెరికాకు పూర్వ వైభవం తెస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థికంగా అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతానని... అమెరికా అభివృద్ధి రేటును రెండింతలు చేస్తానని ట్రంప్ తెలిపారు. కష్టపడి పనిచేస్తే, ఏ కల అయినా సార్థకమవుతుందని అన్నారు. మాజీ సైనికులకు అండగా నిలుస్తానని చెప్పారు. ఇన్నాళ్లు మహిళలు, నల్లజాతీయులను తక్కువగా చూశారని... ఇకపై ఆ పరిస్థితి ఉండదని అన్నారు. అమెరికాను దేశాన్ని తాను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పారు.
తన తల్లిదండ్రుల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్తూ వారికి ట్రంప్ కృతజ్ఞతలు చెప్పారు. తనన సోదరుడు రాబర్ట్ కూడా తనకెంతో మద్దతుగా నిలిచారన్నారు. భార్య మెలానియా ట్రంప్, కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం కృషి చేసిన రిపబ్లికన్ పార్టీ నేతలను సభకు పరిచయం చేసి, ప్రశంసించారు. హిల్లరీ క్లింటన్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని ప్రశంసించారు.