తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లతో మాట్లాడినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదేసమయంలో ఇతరులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన హెచ్చరించారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో వివాదాస్పదంగా మారిన కాశ్మీర్ అంశంపై అగ్రరాజ్యాధినేత ఇద్దరితోనూ చర్చించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇద్దరు మంచి మిత్రులు.. భారత్, పాకిస్థాన్ ప్రధానులతో ఫోన్‌లో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం అంశాలను చర్చించినట్లు చెప్పారు.
కాశ్మీర్‌లో అంశంలో రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేయాలని కోరినట్లు ట్రంప్ తన ట్వీట్‌లో తెలిపారు. పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నా.. కానీ ఇద్దరితోనూ మంచి సంభాషణ జరిగినట్లు ట్రంప్ వెల్లడించారు. మొదట ట్రంప్‌తో నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. పాక్ ప్రధాని వాడుతున్న భాష గురించి ట్రంప్‌కు మోడీ ఫోన్‌లో చెప్పారు.
ఇమ్రాన్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నట్లు మోడీ తన ఫోన్ సంభాషణలో అన్నారు. అయితే మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత.. ఇమ్రాన్‌తోనూ ట్రంప్ ఫోన్ మాట్లాడారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని.. మృదువుగా సంభాషించాలంటూ ఇమ్రాన్‌తో ట్రంప్ అన్నారు. కాశ్మీర్ అంశంపై రెండు దేశాలు సంయమనం పాటించాలంటూ వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదిలావుండగా, భారత్‌పై ఆదివారం కూడా ఇమ్రాన్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. భారత ప్రభుత్వానివి ఫాసిస్టు విధానాలని, దీని వల్ల పాక్‌తో పాటు భారత్‌లోని మైనార్టీలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో మోడీ ఫోన్‌లో మాట్లాడుతూ.. ఉగ్రవాద, హింసారహిత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సీమాంతర ఉగ్రవాదానికి చరమగీతం పాడాలన్నారు. ఈ మార్గాన్ని అనుసరించే ఎవరితోనైనా, పేదరికం, నిరక్ష్యరాస్యతపై పోరాటంపై కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.