సిరియా, ఇరాక్‌లలో ఐసిస్ కథ ముగిసింది.. త్వరలోనే అంతం: డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

గురువారం, 13 జులై 2017 (11:24 IST)
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఓడిందని.. అందువల్ల అరబేతర దేశాలకు చెందిన యోధులంతా తిరిగి తమ తమ సొంతదేశాలకు వెళ్లిపోవాలి లేదా తమను తాము పేల్చుకుని చచ్చిపోవాలని ఆ సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ తెలిపినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న బాగ్దాదీ 'వీడ్కోలు ప్రసంగం' పేరుతో ఒక ప్రకటన విడుదల చేశాడు. దాన్ని ఐసిస్ ప్రబోధకులకు, మతప్రవక్తలకు పంచిపెట్టారు. మోసుల్ నగరంలో ఇస్లామిక్ స్టేట్ మీద ఇరాకీ ఆర్మీ తన పట్టు బిగించడంతో ఐఎస్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో సిరియా, ఇరాక్‌లలో ఐఎస్ఐఎస్ పట్టుకోల్పోయిందని అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. త్వరలోనే ఆ ఉగ్రవాద సంస్థను అంతం చేస్తామని చెప్పారు. ఐఎస్ఐఎస్ ప్రధాన పట్టణమైన మోసూల్‌ను ఇరాక్ సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకుంది. ఇంకా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ మరణించాడని సాక్షాత్తూ ఆ సంస్థే ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, సిరియా, ఇరాక్‌ నుంచి ఐఎస్ఐఎస్ పూర్తి తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఐఎస్‌ను అంతం చేయడంతో చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటిరావడం 75 శాతం తగ్గిపోయిందని ట్రంప్ ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి