అమెరికాకు వచ్చే టెక్కీలంతా ''స్పెషల్ పీపుల్''.. బిలిగేట్స్ నిజమేంటో చెప్పారు: డొనాల్డ్ ట్రంప్

బుధవారం, 21 జూన్ 2017 (16:09 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్కీల విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. వైట్‌హౌస్‌లో అమెరికన్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల రోజంతా డొనాల్డ్ ట్రంప్ పక్కనే కనిపించారు. ఈ సందర్భంగా టెక్కీలను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. నిపుణులైన టెక్కీలను అమెరికా ఎప్పుడూ స్వాగతం పలుకుతుందన్నారు. 
 
బిల్ గేట్స్ వంటి వారు తనకు నిపుణులైన విదేశీ ఉద్యోగుల అవసరాన్ని గురించి వివరించారని తెలిపారు. అమెరికాకు వచ్చే ఐటీ నిపుణులను స్పెషల్ పీపుల్‌గా ట్రంప్ అభివర్ణించారు. ఇమిగ్రేషన్ విధానంలో ఐటీ కంపెనీలకు ఉన్న అన్ని అనుమానాలను తీరుస్తామని, వినూత్న ఉత్పాదనల సృష్టికి తాము పెద్దపీట వేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఐటీ కంపెనీలు వీసా, ఇమిగ్రేషన్ నిబంధనల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని ట్రంప్ దృష్టికి తీసుకురాగా, డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించారు. 
 
కాగా అమెరికన్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశంలో తన అల్లుడు జారెడ్ కుషనర్, బిలియనీర్ ఇన్వెస్టర్ పీటర్ తీల్‌లతో పాటు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ మొత్తం 18 కంపెనీల అధినేతలు పాల్గొన్నారు. భారత్ తరపున సత్య నాదెళ్లతో పాటు మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా, అడోబ్ చీఫ్ శంతను నారాయణ్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి