వణికిపోయిన జపాన్.. 7.1 మ్యాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం

ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (08:41 IST)
జపాన్ దేశం మరోమారు వణికిపోయింది. ఈ దేశంలో మరో భూకంపం సంభవించింది. జపాన్‌లోని ఫుకుషిమా ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం సంభవించింది. దీని కేంద్రం, నైమీ పట్టణానికి తూర్పువైపున 90 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే, జపాన్ రాజధాని టోక్యోకు ఈశాన్యంగా 306 కిలోమీటర్ల దూరంలో ఉంది. 
 
జపాన్ కాలమానం ప్రకారం, రాత్రి 11.08 గంటలకు ఇది సంభవించింది. భూ ప్రకంపనలు టోక్యో వరకూ కనిపించాయని అధికారులు తెలిపారు. భూకంపం సంభవించగానే, ప్రజలు ఆందోళనతో వీధుల్లోకి వచ్చారని, స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
ఇక ఈ భూకంపానికి సంబంధించిన చిత్రాలను, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పెట్టారు. మాల్స్ లోని ర్యాక్స్ లో పెట్టి వస్తువన్నీ కింద పడిన చిత్రాలను, భవనాలు ఊగుతుండటం, ప్రజలు టేబుల్స్, తదితరాల కిందకువెళ్లి, ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండటం వంటి వీడియోలు ఉన్నాయి.
 
ఇదిలావుంటే, ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం జరుగలేదని తెలుస్తోంది. అలాగే, భూకంపం తర్వాత, సునామీ హెచ్చరికలు సైతం జారీ చేయలేదని వెల్లడించింది. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు