ఇస్లామిక్ స్టేట్ ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. సైన్యాన్ని, ప్రజలను లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈజిప్ట్‌లోని సినాయ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఆర్మీ చెక్ పాయింట్ వద్దకు ప్రవేశించిన ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 12 మంది ఈజిప్టు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
మరో ఎనిమిది మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కారణమై వుంటారని సైనికాధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం బిర్ అల్ -ఆద్ సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఉగ్రదాడి జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ దాడి ప్రాంతంలో ఆయుధాలు, రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు.
మరోవైపు ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ బోకో హారామ్ 21 మంది బాలికలను విడుదల చేసింది. 2014 ఏప్రిల్‌లో నైజీరియాలోని చిబోక్ పట్టణంలో ఓ స్కూల్ నుంచి సుమారు 270 మంది బాలికలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇది తీవ్ర సంచలనం రేపింది. మా బాలికలను వెనక్కి రప్పించండి అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ బాలికల్లో కొందరు తప్పించుకోగా 200 మందికి పైగా కనిపించకుండా పోయారు.
ఈ నేపథ్యంలో బోకో హారామ్ ఉగ్ర సంస్థతో నజీరియా ప్రభుత్వం, అంతర్జాతీయ రెడ్ క్రాస్, స్విస్ ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో రెండేళ్ళ కిందట ఉగ్రవాదులు అపహరించిన బాలికల్లో 21 మందిని విడుదల చేశారు. మిగిలిన వారిని విడిపించే ప్రక్రియ కూడా జరుగుతోంది.