ఇంగ్లండ్‌లో ఆంక్షలు ఎత్తివేత... ఇదే సరైన సమయం : బోరిస్ జాన్సన్

సోమవారం, 19 జులై 2021 (14:25 IST)
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌లో అన్ని రకాల కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది. ముఖానికి మాస్క్ కూడా ధరించనక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని బోరిస్ జాన్సన్ తోసిపుచ్చారు. ఇదే సరైన సమయని, ఇపుడు కాకపోతే ఇంకెపుడు తొలగిస్తామంటూ ఎదురు ప్రశ్న వేశారు. 
 
మరోపైపు బ్రిటన్ వ్యాప్తంగా కరోనా డెల్టా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రమాదం ఇంకా పొంచే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కొత్త కేసులు 50 వేలు నమోదవుతున్నా.. రోజువారీ కేసుల నమోదులో మూడో స్థానంలో ఉన్నా కూడా ఆంక్షల ఎత్తివేతకే మొగ్గు చూపింది.
 
నిపుణుల హెచ్చరికలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. పెట్టిన ఆంక్షలన్నింటినీ ఎత్తేసింది. నైట్ క్లబ్బులు, ఇతర ఇండోర్ స్టేడియాలను బార్లా తెరిచేసింది. మాస్కులు పెట్టుకోవాలన్న నిబంధనను, ఇంటి నుంచి పనిచేసే వెసులుబాట్లను రద్దు చేసింది. 
 
ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ప్రధాని బోరిస్ జాన్సన్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. దేశంలో 66 శాతం మందికి వ్యాక్సిన్ వేశామని, ఇంకా వేసుకోనివారెవరైనా ఉంటే వెంటనే టీకా తీసుకోవాలని బోరిస్ సూచించారు. 
 
అదేసమయంలో ఆంక్షలను ఎత్తేయాలన్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. ‘స్వేచ్ఛా దినం’గా కొన్ని మీడియాల వార్తలకు పూర్తి మద్దతునిచ్చారు. ఆంక్షల నుంచి దేశాన్ని బయట పడేయడానికి ఇదే సరైన సమయమన్నారు.
 
‘‘పాఠశాలలకు వేసవి సెలవులతో ఈ వారం ప్రారంభమవుతోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దేశాన్ని తెరుస్తాం? కాబట్టి ఆంక్షలను ఎత్తివేయడానికి ఇదే సరైన టైం అని నేను భావిస్తున్నా. అయితే, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన సూచించారు. 
 
మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అన్ లాక్ ప్రకటిస్తే ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఆంక్షలను ఎత్తేయడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందని ప్రతిపక్ష లేబర్ పార్టీ అధికార ప్రతినిధి జొనాథన్ ఆశ్వర్థ్ మండిపడ్డారు. 
 
ఇది తొందరపాటు చర్య అని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యుసన్ అన్నారు. డెల్టా వేరియంట్ అదుపులో లేదని, కొన్ని రోజుల్లోనే రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. రోజూ 2 వేల మంది ఆసుపత్రుల పాలైనా.. 2 లక్షల కేసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు