తప్పంతా భారత్‌దే.. కానీ మాపై దుష్ప్రచారం చేస్తోంది : చైనా ఆర్మీ
బుధవారం, 24 జూన్ 2020 (19:30 IST)
లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలపై చైనా పీపుల్స్ ఆర్మీ తొలిసారి బుధవారం స్పందించింది. తప్పంతా భారతదేశానిదేనని, ఇందులో తమ తప్పు ఎంతమాత్రం లేదనీ, కానీ దుష్ప్రచారం మాత్రం మాపై చేస్తోందంటూ చైనా ఆర్మీ ఆరోపించింది.
ఈ నెల 15న తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో 20 మంది జవాన్లను భారత్ కోల్పోయింది. ఈ విషయంపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తొలిసారి బుధవారం ఓ ప్రకటన చేసింది.
చైనా వైపున ఉన్న భూభాగంలో ఆ ఘర్షణ జరిగిందని చెప్పుకొచ్చింది. భారత సైనికులే నియంత్రణ రేఖను దాటి వచ్చారని, ఈ ఘర్షణకు భారత్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది.
కాగా, చైనా రక్షణశాఖ ప్రతినిధి వూ కియాన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత సైన్యం ఉల్లంఘించిందని చెప్పుకొచ్చారు.
ఈ ఘర్షణ అనంతరం ఇరు దేశాలకు చెందిన రక్షణశాఖ మంత్రులు ఫోన్‌లో మాట్లాడుకున్నారని తెలిపారు. ఈ నెల 15న ఘర్షణ జరిగిన ఘటన తమను షాక్‌కు గురి చేసిందని చెప్పారు.
అంతేకాకుండా, గాల్వన్‌లో భారత జవాన్లే తమ బలగాలను రెచ్చగొట్టారని చైనా ఆరోపించింది. జరిగిన ఘటనపై భారత విదేశాంగశాఖ, ఇండియన్ మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నాయని విమర్శించింది.
చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ భారత్ విదేశాంగ శాఖ, అక్కడి మీడియా చేస్తున్న ప్రచారం వల్ల తప్పుడు సమాచారం వెళ్తోందని అన్నారు.
వాస్తవ పరిస్థితి ఏమిటో అందరికీ అర్థం కావాలని... అందుకే నిజాలను వెల్లడించడమే తన ఉద్దేశమని చెప్పారు. భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు కలిసి ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. రెచ్చగొట్టేందుకు యత్నించాయని అన్నారు.