ఆ దేశంలో వారానికి నాలుగు రోజులో పనిదినాలు.... ఫిబ్రవరి 1 నుంచి అమలు

వరుణ్

మంగళవారం, 30 జనవరి 2024 (17:36 IST)
సాధారణంగా అనేక కార్పొరేట్ కంపెనీలు, ఐటీ కంపెనీల్లో పని చేసే సిబ్బందికి వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలుగా అమలవుతున్నాయి. అలాగే, మన దేశంలో తమిళనాడు, పుదుచ్చేరి వంటి కొన్ని రాష్ట్రాల్లో వారానికి ఐదు రోజులు పని దినాలు అమలవుతున్నాయి. అయితే, జర్మనీ దేశం మాత్రం ఒక అడుగు ముందుకేసింది. వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేసే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి, ఈ విధానాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. ప్రయోగాత్మకంగా చేపడుతున్నఈ విధానం వచ్చే ఆరు నెలల పాటు అమల్లో ఉండనుంది. 
 
అయితే, జర్మనీ దేశం ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మందగమనం నెలకొంది. అదేసమయంలో అధిక ద్రవ్యోల్బణం దేశాన్ని పట్టిపీడిస్తుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న తాజాగా ఆర్థిక స్థితిగతులపై ఓ అధ్యయనం నిర్వహించి, కొన్ని కీలక సిఫారసులు చేసింది. ఇందులో ఒకటి వారానికి నాలుగు రోజుల పనిదినాలు. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా పనిలో చురుకుదనం పెరిగి, ఉత్పాదక అధికమవుతుందని జర్మనీ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 
 
కాగా, ఈ కొత్త పని విధానాన్ని అమలు చేసేందుకు జర్మనీలో నాలుగు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. వారంలోని నాలుగు రోజుల్లో ఉద్యోగులు కొన్ని గంటల పాటే పని చేసినా గతంలో చెల్లించిన మేరకే వేతనాలు చెల్లిస్తారు. అయితే, గతంలో ఎంత పని చేశారో, ఈ నాలుగు రోజుల్లో కూడా అదేస్థాయిలో ఉత్పాదకతను చూపించాల్సివుంటుంది. ఈ విధానం వల్ల ఉద్యోగులు సెలవులు పెట్టడం కూడా తగ్గుతుందని పలు కంపెనీలు భావిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు