తోటి విద్యార్థులపై కాల్పులు జరిపిన ఆరో తరగతి బాలిక

శుక్రవారం, 7 మే 2021 (12:40 IST)
ఆరో తరగతి బాలిక తోటి విద్యార్థులపై కాల్పులు జరిపిన ఘటన ఇడాహోలోని రిగ్బీలో చోటుచేసుకుంది. పాఠశాలలో తోటి విద్యార్థులపై బాలిక కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ గాయపడిన వారిలో ఒకరిని ఈస్టర్న్ ఇడాహో ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారికి సర్జరీ చేయాల్సి ఉందని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.
 
ఆరవ తరగతి విద్యార్థి తన బ్యాగులో నుంచి తుపాకీని తీసి ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా తోటి విద్యార్థులపై కాల్పులు జరిపినట్టు జెఫెర్సన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. 
 
పాఠశాల హాలులో వరుసగా మూడుసార్లు కాల్పులు జరిపింది. భయంతో విద్యార్థులంతా బయటకు పరుగులు తీశారు. బాలిక చేతిలో తుపాకీని ఒక టీచర్ లాగేసుకుని పోలీసులకు అప్పగించాడు.
 
బాలిక కాల్పులు జరపడానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇంతకీ బాలికకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదన్నారు. ఈ సంఘటన తరువాత విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు