తమ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తీరుకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి భారతదేశంతో పాటు.. ప్రచంచ దేశాల మద్దతు కావాలని నేపాల్ కమ్యూనిస్టు నేత పుష్ప కమల్ ధమాల్ ప్రచండ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని కేపీశర్మ ఓలీ తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. అప్రజాస్వామ్య రీతిలో పార్లమెంట్‌ను రద్దు చేశారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని తిరిగి తీసుకురావాలంటే పార్లమెంట్‌ను తిరిగి పునరుద్ధరించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ రద్దు అన్న అప్రజాస్వామిక చర్యను చివరికి సుప్రీం కూడా సమర్థించదని తాము భావిస్తున్నామన్నారు. పార్లమెంట్‌ను తిరిగి పునరుద్ధరించకపోతే దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుందని ప్రచండ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
'ప్రధాని కేపీశర్మ ఓలీ అప్రజాస్వామికంగా పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఇది కాస్తా ప్రజాస్వామ్య పతనానికి దారితీసింది. ఈ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం గమనించాలి. దేశంలో తిరిగి ప్రజాస్వామ్య పునరుద్ధరణకై భారత్, చైనాతో పాటు అంతర్జాతీయ సమాజం అంతా మాకు అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నా' అని ప్రచండ కోరారు.
చైనా మద్దతుతోనే కేపీ శర్మ పార్లమెంట్‌ను రద్దు చేశారా? అని ప్రశ్నించగా తమ దేశ వ్యవహారాల్లో ఇతర దేశాలను తాము లాగలేమని స్పష్టం చేశారు. ఇలాంటి కీలక వ్యవహారాల్లో ఇతర దేశాల నిర్ణయం ఉండదని, కేవలం దేశీయ నేతల నిర్ణయమే ఉంటుందని ప్రచండ తేల్చి చెప్పారు.