యూరీ ఘటనతో పాకిస్థాన్‌పై యావత్తు ప్రపంచం గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోనూ పాకిస్థాన్‌కు చుక్కెదురైంది. ఐరాస సాక్షిగా పాకిస్థాన్‌పై భారత్ నిప్పులు చెరిగింది. ఈ సందర్భంగా యూరీ ఘటనలో జవాన్లు పొట్టనబెట్టుకోవడంపై భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్.. కాశ్మీర్ అంశంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తన వాదనను ఇలా వినిపించింది. ఇందులో భాగంగా.. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్ర బిందువుగా మారిందని.. అలాంటి పాకిస్థాన్ మానవ హక్కుల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉందని భారత్ మండిపడింది. అంతర్జాతీయంగా అందే సహాయ సహకారాలతో ఉగ్రవాద సంస్థలకు శిక్షణ ఇచ్చి.. పెంచి పోషిస్తూ.. పొరుగు దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలను కొనసాగిస్తోందని.. పాకిస్తాన్ అండదండలతోనే తీవ్రవాద సంస్థలను నడిపించే ఉగ్రనాయకులు స్వేచ్ఛగా అక్కడ బహిరంగంగా తిరగగలుగుతున్నారని భారత్ ఫైర్ అయ్యింది.
తీవ్రవాది, హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని ఐక్యరాజ్యసమితిలోనే అమరవీరుడిగా నవాజ్ షరీఫ్ కీర్తించడమే ఇందుకు నిదర్శనమని భారత్ ఎత్తిచూపింది. ఓ వైపు అణ్వాయుధ వ్యాప్తికి పాకిస్తాన్ కృషి చేస్తూనే.. శాంతి గురించి మాట్లాడుతుందని.. ఉన్నత విద్యకు నిలయంగా నిలిచిన ఒకప్పటి చారిత్రక తక్షశిలా నగరం ప్రస్తుతం తీవ్రవాద సంస్థలకు అడ్డాగా మారిందని భారత్ వ్యాఖ్యానించింది.