కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ ఒకటి వెలుగు చూసింది. దీన్ని దెబ్బకు బ్రిటన్ వాసుల హడలిపోతున్నారు. ఈ కొత్త కరోనా కేసులు కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. పైగా, ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో బ్రిటన్ నుంచి వివిధ దేశాలకు వచ్చి వెళ్లే విమాన రాకపోకలపై ఆంక్షలు అమలవుతున్నాయి.
ఇప్పటికే యూరప్ దేశాలు కీలక చర్యలు తీసుకోగా, ఇప్పుడా దేశాల బాటలోనే భారత్ కూడా నడుస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. విమానాల రద్దు నిర్ణయం రేపు అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది.
బ్రిటన్‌లో కొత్తరకం స్ట్రెయిన్‌పై అక్కడి ఆరోగ్యమంత్రి మాట్ హేంకాక్ స్పందిస్తూ, పరిస్థితి చేయిదాటిపోయిందని ప్రకటించడంతో ఇతర యూరప్ దేశాలు అప్రమత్తం అయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాలు నిషేధించాయి.
యూరోపియన్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు యూకే నుంచి ప్రయాణాలను నిషేధించాయి. యూకే నుంచి ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా దేశాలు నిన్న ప్రకటించాయి. యూరప్ కు వెలుపల ఉన్న సౌదీ అరేబియా, టర్కీ, ఇజ్రాయెల్ దేశాలు యూకే నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశాయి.