డ్రాగన్ సైనికులను పరుగెత్తించిన ఇండియన్ ఆర్మీ.. ఎపుడు? ఎక్కడ?

మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:13 IST)
భారత్ - చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా సైనికులు హద్దుమీరి భారత భూభాగాన్ని ఆక్రమించుకునే దుస్సాహసానికి ఒడిగట్టాయి. దీన్ని పసిగట్టిన భారత బలగాలు... డ్రాగన్ సైనకులను తరిమికొట్టాయి. అంతేకాకుండా, కీలకమైన ఓ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. 
 
పాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలోని ఓ ఎత్తయిన ప్రాంతాన్ని చైనా ఆర్మీ నుంచి భారత జవాన్లు స్వాధీనం చేసుకున్నారని సైనిక వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారత్‌దే పై చేయి అయిందని సమాచారం. ప్రస్తుతం చైనా జవాన్లు ఉన్న ప్రాంతానికన్నా ఎత్తయిన ప్రాంతాన్ని మన జవాన్లు కైవసం చేసుకున్నారు. 
 
ఇటీవల ఇరు దేశాల సైన్యం మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. చైనా సైనికులు భారీ ఎత్తున మెషీన్లను తెచ్చి, ఇక్కడ నిర్మాణాలు చేపట్టగా దాన్ని భారత సైనికులు అడ్డుకున్నారు. "ఈ ప్రాంతంలో ఉన్న స్పెషల్ ఆపరేషన్ బెటాలియన్ చైనాను అడ్డుకుంది. సరస్సు దక్షిణ భాగంలోని తౌకుంగ్ ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది ఓ వ్యూహాత్మక ప్రాంతం. ఇక్కడి నుంచి సరస్సు పశ్చిమ ప్రాంతాన్నంతా నియంత్రించ వచ్చు. సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలపైనా నిఘా పెట్టవచ్చు" అని సైనిక వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ ప్రాంతం కూడా వాస్తవానికి వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూ భాగంలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రాంతం తమ దేశానికి చెందినదని చైనా చాలా కాలంగా వాదిస్తోంది. ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు బ్రిగేడియర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చలు ఇంతవరకూ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. 
 
ఓ వైపు చర్చలు జరుగుతుండగా, భారత సైన్యం, నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా కమాండర్ ఆరోపించగా, భారత్ వాటిని కొట్టిపారేసింది. చైనా జవాన్లే రెచ్చగొడుతూ మన భూభాగంపైకి దండెత్తేందుకు వస్తున్నారని, భారత ఆర్మీ దాన్ని ఎదుర్కొంటోందని భారత సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు