ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే నిషేధం అమల్లోకి వచ్చింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన కాసేపట్లోనే టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లు మూగబోయాయి. దీనికితోడు చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఏసీలు, టీవీలు సహా 12 రకాల వస్తువులను నియంత్రించాలని భారత్ యోచిస్తోంది.
వీటిని దిగుమతి చేసుకోవడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. నిజానికి ఈ లైసెన్స్ పద్ధతికి కొద్ది నెలల క్రితమే తెర లేచింది. వివిధ దేశాల నుంచి అగరువత్తులు, టైర్లు, పామాయిల్ దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ తప్పనిసరి చేశారు. లద్దాఖ్ ఘర్షణల తర్వాత ఈ జాబితాలోకి చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకొనే ఏసీలు, టీవీలు, వాటి విడిభాగాలు వచ్చి చేరబోతున్నాయి.
దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దిగుమతి సుంకాన్ని భారీగా విధించడం, విడి భాగాల తయారీలో కనీస సాంకేతిక ప్రమాణాలను నిర్దేశించడం, కొన్ని రకాల వస్తువులను కొన్ని రేవుల ద్వారా మాత్రమే దిగుమతి చేసుకోవాలని షరతులు విధించడం ద్వారా దిగుమతులను నిరుత్సాహపరుస్తారు.