ఒళ్లుగగుర్పొడిచే దుశ్చర్యలతో ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఇపుడు మరో కొత్త పంథాను ఎంచుకున్నారు. ఉగ్రవాదంతో ప్రజలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ మాట వినని వారిని అత్యంత పాశవికంగా హతమారుస్తున్నారు. ఊహకు కూడా అందని శిక్షలను అమలు చేస్తోంది. కిరాతరంగా గొంతులు కోయడం, ఉరితీయడం, తుపాకులతో కాల్చడం, పై అంతస్థు నుండి కిందికి పడేయడం, ఇలా రకరకాల వికృత చర్యలకు పాల్పడుతున్నారు.
ఐఎస్ తాజాగా ఏడుగురు జీహాదీలకు మరణశిక్షను అమలు చేసింది. ఈ శిక్షను సలసలా కాగే నీటిలో ఉడకబెట్టి చంపడం ద్వారా అమలు చేసింది. ఈ శిక్షను వింటే ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. నిజానికి ఒక్క వేడినీటి చుక్క ఒంటిపై పడితేనే విలవిలలాడిపోతామే అలాంటిది... బతికున్న మనుషుల్ని బాగా మరగబెట్టిన నీళ్లలో ప్రాణాలు పోయేంతవరకు ఉడకబెట్టారు. బహిరంగ ప్రదేశంలో పొయ్యిపై ఒక భారీ పాత్రను ఉంచి దానిలో నీళ్లు మరిగించి...ఆపై జీహీదీల కాళ్లూ, చేతులు కట్టేసి అందులే పడేశారు. ఇప్పుడు తమ మాట వినని జిహాదీలను మరిగే నీళ్లలో ముంచుతున్నారు.
ఇరాక్, సిరియాల్లోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్న ఐసిస్.. ఆ దేశాల భద్రతా దళాలతో నిత్యం తలపడుతూనే ఉంది. బాగ్దాద్‌లోని సెంట్రల్ ఫల్లుజా ప్రావిన్స్‌లో భద్రతా దళాలతో పోరు సమయంలో వెన్నుచూపి పారిపోయినందుకు ఏడుగురు జీహాదీలకు ఐఎస్ఐఎస్ కోర్టు 'మరణ శిక్ష' విధించింది. ఆ శిక్షనే ఈ విధంగా అమలు చేశారు. అయితే బందీలుగా పట్టుకున్న మహిళా బానిసలు తమకు లొంగని పక్షంలో వారి ఒంటిపై వేడినీళ్లు కుమ్మరించడం మామూలే అయినా... జీహాదీలను కాగునీటిలో ముంచి చంపడం మాత్రం ఇదే మొదటిసారి.
ఐఎస్ తన జిహాదీలను చంపుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆదేశాలు పాటించని వారిని అత్యంత దారుణంగా చంపిన సందర్భాలు అనేకం. గత నెలలో 19 మంది జిహాదీలను తుపాకితో కాల్చిచంపిన ఐసిస్ అగ్రనేతలు.. మే నెలలో మౌసూల్ పట్టణంలో 25 మంది అనుమానిత గూఢచారులను నైట్రిక్ యాసిడ్ లో ముంచి చంపేసిన సంగతి తెలిసిందే. సిరియాలో పట్టుపడ్డ ఐదుగురు జర్నలిస్టులను గత నెల(జూన్‌లో) బాంబులతో పేల్చి చంపారు. బందీలుగా చిక్కిన ఇతర జాతుల మహిళలను కూడా ఐసిస్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేస్తారు. చంపడం లేదా చావడం అనే నినాదం నుంచి చంపకపోతే చంపుతాం అనే బలవంతపు యుద్ధంలోకి యువకులను దించుతున్న ఐసిస్ నిజంగా ఓ రాక్షస బృందం.