ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తమ వద్దనున్న బందీలను క్యాష్ చేసుకోవాలని కొత్త మార్గాన్ని కనిపెట్టింది. ఆత్మాహుతి దాడులతో విధ్వంసం సృష్టించడం తమకు దొరికిన జర్నలిస్టులు.. ఇతర బందీలను కిరాతకంగా చంపేసే ఐఎస్.. తమ వద్దనున్న అందమైన అమ్మాయిలను అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు అమ్మకానికి అందమైన కన్యలంటూ వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లో ప్రత్యక్షమైన ప్రకటనలు కలకలం రేపాయి.
అరబిక్ భాషలో ఉన్న వీటిని ఐఎస్ఐఎస్ పోస్ట్ చేసింది. ఉత్తర ఇరాక్‌లో పట్టును కోల్పోయిన ఐఎస్.. బందీలుగా ఉన్న సుమారు 3వేల మంది మహిళలు, బాలికలపై పట్టుబిగించింది. వ్యభిచార బానిసలుగా వీరిని కాపాడే కుర్దీష్ స్మగ్లర్ల నుంచి తమ ఆధీనంలో పెట్టుకోవాలనుకుంది. ఇందులో భాగంగా మహిళలు, బాలికల వివరాలు, ఫోటోలతో పాటు ఎవరి ఆధీనంలో ఉన్నారన్నదానిపై ఓ డేటాబేస్‌తో కూడిన యాప్‌ను ఐఎస్ తయారు చేసింది.
ఈ యాప్ ద్వారా ఎవరైనా తప్పించుకుంటే మిగతా వారికి వెంటనే ఆ సమాచారం తెలిసిపోతుంది. ఈ డేటాబేస్‌ను ఐఎస్ మరో విధంగా వినియోగించుకుంటోంది. అంతేగాకుండా ప్రస్తుతం డబ్బుల్లేకుండా కష్టాల్లో ఉన్న ఐఎస్.. నగదును కూడబెట్టుకునేందుకు మహిళా బందీలను ఉపయోగించుకోవాలనుకుంటుంది. దీంతో డబ్బులు కూడ బెట్టేందుకు తమ వద్ద వ్యభిచార బానిసలుగా ఉన్న మహిళలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. 12 ఏళ్ళ బాలికలను కూడా అందమైన కన్యలుగా పేర్కొంటూ.. 12,500 డాలర్లకు అమ్మకానికి పెట్టేసింది. వీరి ఫోటోలు, వివరాలతో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లో ఐఎస్ ప్రకటనలు ఇస్తోంది.