పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమపని కాదంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు తమ సొంత గూటి పక్షులే అయిన జైషే మహమ్మద్ గట్టి ఝలక్ ఇచ్చింది. ఆయన అడుగుతున్న ఆధారాలను వీడియో రూపంలో బయటపెట్టింది. తనకు తానుగా సాక్ష్యాలను అందజేసింది. పుల్వామా ఉగ్రదాడి తమ పనేనని పేర్కొంటూ మంగళవారం రెండో వీడియోను విడుదల చేసింది. అయితే అక్కడితో ఆగకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని వీడియోలో పేర్కొనడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
వివరాలలోకి వెళ్తే... మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పుల్వామా ఉగ్రదాడికీ తమకూ ఎలాంటి సంబంధంలేదని పేర్కొంటూ భారత్ వాదనలను కొట్టిపడేయడంతోపాటు తమ దేశం కూడా స్వయంగా ఉగ్ర బాధిత దేశమేనని వాపోతూ తమపై నిందలు వేస్తున్న భారత్.. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి రుజువులు ఉంటే చూపాలని పదే పదే కోరడం జరిగింది.