'స్పైడర్‌మేన్' సినిమాలలో చూపిన విధంగా సాలెపురుగు నిజ జీవితంలో కూడా వింతలు చేస్తుందంటే అది ఎంతమాత్రమూ నమ్మశక్యం కాదు. కానీ నిజ జీవితంలో అది ఏమీ చేయకపోయినా ఒక ఇల్లు కాలిపోవడానికి మాత్రం కారణమయ్యింది. అదేంటి రాజమౌళి సినిమాలో 'ఈగ' చేసిన విధంగా చేసిందా అని అనుకుంటారేమో..అదేం కాదులేండి. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి అనే చందాన ఈ సంఘటన జరిగింది.
వివరాలల్లోకెళితే, ఫ్రెస్నో పట్టణానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఇంట్లో కూర్చొని తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో, ఒక నల్ల సాలెపురుగు ఇంట్లోకి రావడం గమనించిన అతను బ్లో టార్చ్ ద్వారా దానిని చంపే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదవశాత్తూ ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఇంతలో మంటలకు భయపడి ఆ యువకుడు బయటకు పరుగులు తీయడంలో ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.