గతంలో కేఎఫ్‌సీ చికెన్‌లో ఎలుక ముక్కంటూ పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కమ్మటి మెక్ డొనాల్డ్స్ కాఫీలో బొద్దింక కాళ్లు కనిపించాయి. కమ్మటి కాఫీ రుచి కోసం మెక్ డోనాల్డ్స్‌లోకి వెళ్లిన ఓ కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్యాంకాక్‌కు చెందిన నోస్టాలిక్ ఐక్ (28) అనే వ్యక్తి స్థానిక మెక్‌డోనాల్డ్స్‌కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశాడు. ఆ కాఫీలో బొద్దింక కాళ్లు కనిపించడంతో మరో కప్పులో కాఫీ తెప్పించుకున్నాడు. రెండోసారి తెచ్చిన కాఫీలో కూడా బొద్దింక కాళ్లు కనిపించాయి. దీనిని తన స్మార్ట్‌ఫోన్‌లో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
మెక్‌డొనాల్డ్స్‌లో అధిక శుభ్రత పాటిస్తారని తాను అనుకున్నానని, అయితే, ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అనుకోలేదన్నాడు. దీనిపై మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధులు సదరు వినియోగదారుడికి క్షమాపణలు చెప్పారు. దీనిపై విచారణ చేపడతామని మెక్ డొనాల్డ్స్ సంస్థ హామీ ఇచ్చింది.