చంద్రుడుని కూడా తవ్వేస్తారట... ఎందుకు?

గురువారం, 24 జనవరి 2019 (16:53 IST)
ప్రకృతిని ధ్వంసం చేయడంలో మానిషిని మించిన శక్తి మరొకటి లేదని చెప్పొచ్చు. ప్రకృతి ఇచ్చిన అనేక సహజవనరులను అవసరానికి మించి వాడేస్తున్నారు. ముఖ్యంగా, కొండ గుట్టలు, భూగర్భంలో దాగివున్న విలువైన ఖనిజ సంపదను కూడా తవ్వి వెలికి తీస్తున్నారు. సముద్ర గర్భంలో నిక్షిప్తమైవున్న పెట్రోల్, డీజిల్ వంటి సహజవాయులను సైతం వెలికి తీసి మోతాదుకు మించి వాడేస్తున్నారు. ఫలితంగా వాయు కాలుష్యం పెరిగి భూతాపానికి దారితీస్తోంది. ఈ కాలుష్యం ఇదేవిధంగా పెరిగిపోతే.. భూమిపై మనిషి మనుగడ ఉండదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అదేసమయంలో కొత్త ఇంటి (గ్రహం) కోసం మనిషి అన్వేషణ చేపట్టాడు. ఇందుకోసం చంద్రుడు లేదా మార్స్‌పై బతకడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా? లేవా? అనేదానిపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా అమెరికా క్యూరియాసిటీ రోవర్‌తో మార్స్‌పై మనిషి బతకగలడా? అని పరిశోధిస్తోంది. భారత్ కూడా చంద్రయాన్-1తో చంద్రుడిపై నీటి జాడను గుర్తించింది. ఇప్పుడు చంద్రయాన్-2కు సిద్ధమవుతోంది. చైనా కూడా చీకటి చంద్రుడిపై దిగుతానని చెప్పడమే కాదు... చేసి చూపించింది కూడా. పత్తి పండిస్తానని విత్తు నాటింది. ఆ విత్తు కాస్త మొలకెత్తింది. దీంతో ఇక జీవానికి ఢోకా లేదన్న ఆశ పుట్టేలోపే అది చనిపోయింది. 
 
ఈపరిస్థితుల్లో యూరప్‌ కూడా చందమామపై దృష్టిసారించింది. ఇందుకోసం చందమామను తవ్వాలని నిర్ణయించింది. చంద్రమండలంపై ఉన్న ఖనిజ నిక్షేపాలను తవ్వి తీసేందుకు ఉవ్విళ్లూరుతోంది. చంద్రుడిపై బేస్‌ ఏర్పాటు చేసేందుకు రాకెట్లను తయారు చేసే ఏరియన్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) వెల్లడించింది. 
 
వచ్చే 2025 నాటికి జాబిల్లిపైకి వెళ్లి పని మొదలుపెడతామని తెలిపింది. చంద్రుడిపై ఉండే వనరులను ఉపయోగించుకుంటామని చెప్పింది. 'చంద్రుడిపై మనిషిని పంపడమొక్కటే కాదు. అక్కడ దొరికే వనరులను ఎలా ఉపయోగించుకోవాలో కూడా పరిశోధనలు చేస్తాం. అందుకే చందమామ ఉపరితలంపై ఉండే మట్టి (రీగోలిత్‌) పొరలను తవ్వుతాం' అని ఈఎస్ఏ వెల్లడించింది. అంతరిక్షంలో దొరికే ప్రతి వనరునూ భూమిపైనా వాడుకోవచ్చని అంటోంది. 
 
రీగోలిత్‌ నుంచి నీళ్లు, ఆక్సిజన్‌ను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. వాటితోనే అంతరిక్షంలో మరింత దూరం వెళ్లేందుకు ఇంధనాన్ని తయారు చేసే వీలు చిక్కుతుందని అంటోంది. ఈ యేడాది ఆఖరులో జరిగే స్పేస్‌ 19ప్లస్ సదస్సులో దీనిపై నిర్ణయాన్ని ఖరారు చేస్తామని ఈఎస్‌‌ఏ హ్యూమన్‌ అండ్‌ రోబోటిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డేవిడ్‌ పార్కర్‌ వెల్లడించారు. సో... చంద్రుడుని కూడా తవ్వేసేందుకు ఈఎస్ఏ నిర్ణయం తీసుకుందన్నమాట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు