సముద్ర అడుగు భాగాల్లో సంచరించే మిస్టిరియస్ సొరచేప "ఘోస్ట్ షార్క్" తొలిసారి కెమెరా కంటికి చిక్కింది. ఈ జలచరాన్ని చిమైరా అని కూడా పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఈ ఘోస్ట్‌షార్క్ లక్షణాలు చాలా విచిత్రంగా, ఒకింత వికృతంగా ఉంటాయి. దీని కళ్లు పాలిపోయినట్టు నిర్జీవంగా ఉంటాయి. ఇవి దంతాలకు బదులు దవడాలను ఉపయోగించి ఆహారాన్ని ఆరగిస్తాయి.
ప్రాచీనమైన కుట్లమాదిరిగా దీని తలపై అస్పష్టమైన మచ్చలు కనిపిస్తాయి. పురుష చిమైరాలలో తలముందుభాగంలో వెనుకకు తీసుకునేవిధంగా లైంగిక అంగాలు ఉంటాయి. చూడటానికి ఒకింత వికృతంగా కనిపించే ఈ సొరచేపలను ర్యాట్ ఫిష్, ర్యాబిట్ ఫిష్, స్పూక్ ఫిష్ పేరిట విచిత్రమైనే పేర్లతో పిలుస్తారు.
వాస్తవానికి ఈ ఘోస్ట్ షార్క్ 2009లోనే కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియోకు సంబంధించి మాంటెరే బే అక్వారియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పరిశోధకుడు లానీ లండస్టెన్ కలిసి తాజాగా ఓ పరిశోధన పత్రం వెలువరించడంతో ఇది ఇపుడు వెలుగులోకి వచ్చింది.
కాలిఫోర్నియా, హవాయ్‌కి చెందిన సముద్రపు నీటిలో ఆరేళ్ల కిందట ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన పరిశోధకులు రిమోట్లీ ఆపరేటెడ్ వెహికిల్స్ (ఆర్వోవీ)ను వదిలారు. ఇవి సముద్రంలోని 6,700 అడుగుల లోతులోకి వెళ్లి అందులోని దృశ్యాలను బంధించాయి. ఆర్వోవీ అందించిన దృశ్యాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
ఇందులో తొలిసారిగా అత్యంత అరుదైన ఘోస్ట్‌షార్క్ కెమెరాకు చిక్కింది. ఇది సముద్రంలో విహరిస్తున్న దృశ్యాన్ని కెమెరా ప్రత్యక్షంగా చిత్రీకరించింది. తాజాగా కెమెరాకు చిక్కిన అరుదైన జలచరం బ్లూ చిమైరా అయి ఉంటుందని, గతంలో ఎప్పుడూ ఇది కెమెరా కంటికి చిక్కలేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.