చైనా దూకుడు పెంచింది. డోక్లాం సరిహద్దుల వెంబడి బంకర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఓవైపు శాంతి చర్చల పేరుతో దృష్టి మరల్చి.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా తన పని తాను చేసుకుపోతోంది. మొన్నటికిమొన్న భూటాన్ భూభాగంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకొని వెళ్లి ఏకంగా గ్రామాన్నే నిర్మించినట్లు తేలగా.. ఆ తర్వాత 9 కిలోమీటర్ల మేర రోడ్డునూ నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు తేల్చాయి.
డోక్లాం ప్రాంతంలో మరోసారి వివాదం తలెత్తితే చైనా బలగాలు సమర్థంగా పోరాడేలా ఈ బంకర్లను ఏర్పాటు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన ఈ ప్రాంతంలో తమ బలగాలను పెంచే ఆలోచనలో చైనా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే జరిగితే మరోసారి డోక్లాంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి.
నిజానికి గతేడాది డిసెంబరులో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేనట్లు అప్పటి శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అక్టోబరు 28న తీసిన ఫొటోల్లో మాత్రం నిర్మాణాలు పూర్తయినట్లు కనిపించింది. అంటే ఏడాదిలోపే ఈ బంకర్ల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. ఈ బంకర్ల నిర్మాణాన్ని చూస్తే యుద్ధ సన్నద్ధతలో డ్రాగన్ నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది.