టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మనుష్యుల మధ్య సంబంధాలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకే పరిమితం అయ్యాయి. అనుకున్నది చిటికెలో సాధించుకునే ఆప్షన్ ఆన్‌లైన్‌లో ఉంది. టెక్నాలజీతో మనిషిని పోలిన మనిషిని సృష్టిస్తున్న ఇంటర్నెట్ యుగంలో భారత సంతతికి చెందిన ఒక వైద్యుడు సంతానోత్పత్తికి ఓ యాప్‌ను రూపొందించారు.
ఈ యాప్‌లో ఎత్తు, కళ్ల రంగు, కేశాలు, ఇతరత్రా అంగసౌష్టవం వంటి వివరాలతో పురుషుల ఫొటోలు , వివరాలు పొందింపరిచారు. ఈ వివరాల ద్వారా తమకు నచ్చిన పురుషుని వీర్యాన్ని మహిళలు పొందవచ్చని డాక్టర్ అహుజా వెల్లడించారు. ఈ సరికొత్త యాప్ పై బ్రిటన్ లో యమ క్రేజ్ ఏర్పడింది. చాలా క్లినిక్ లు ఈ యాప్ సేవలు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నాయి. సంతానోత్పత్తి కోసం రూపొందించిన 'ఆర్డర్ ఏ డాడీ' యాప్ ప్రపంచంలోనే మొదటిదని అహుజా వెల్లడించారు.
లండన్‌లో 'సైంటిఫిక్ స్పెర్మ్ బ్యాంకు' డైరెక్టర్ డాక్టర్ కమల్ అహుజా అమ్మ అయ్యే స్త్రీల కోసం 'ఆర్డర్ ఏ డాడీ' యాప్‌ను రూపొందించారు. సంతానోత్పత్తిని కోరుకునే మహిళలు ఈ యాప్ ద్వారా తమకు నచ్చిన పురుషుడి వీర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ పూర్తిగా చట్టబద్ధమైందని.. దీని ద్వారా వీర్యాన్ని పొందాలనుకునేవారు 950 పౌండ్లు చెల్లించాల్సి వుంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించిన వారికి వారు కోరుకున్న సంతానోత్పత్తి కేంద్రంలో వీర్యాన్ని అందజేస్తారు.