కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి దేశం ఏది..?

ఆదివారం, 31 డిశెంబరు 2023 (19:19 IST)
న్యూజిలాండ్ దేశ ప్రజలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2024 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ భారీగా రంగురంగుల బాణాసంచా కాల్చారు. కివీస్ వాసులు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు పసిఫిక్ ద్వీప దేశాలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ నగరం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టింది. 
 
ఇక్కడి ఆక్లాండ్ నగరం కొత్త సంవత్సరం 2024 ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ వాసులు బాణాసంచా కాల్చుతూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు షురూ చేశారు. ఆక్లాండ్‌లోని ప్రఖ్యాత స్కై టవర్ బాణాసంచా వెలుగుజిలుగులతో కాంతులీనింది.


అలాగే, 2024లోకి అడుగుపెట్టే క్రమంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ కళ్లు చెదిరేలా నిర్వహించారు. ఇక్కడి ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెనరా హౌస్ వద్ద చేపట్టిన బాణాసంచా, లైటింగ్ విన్యాసాలు అదరహో అనిపించాయి. ప్రజలు పెద్ద ఎత్తున సిడ్నీ హార్బర్‌ వద్దకు విచ్చేసి కొత్త సంవత్సర సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి యేడాది న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా సిడ్నీ నగరం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఎందుకు టాప్‌లో ఉంటుందో నేటి వేడుకలకు చూస్తే ఇట్టే తెలుసుకోవచ్చు. 
 
కాగా, ప్రపంచంలో మొట్టమొదట నూతన సంవత్సరానికి స్వాగతం పలికే దీవుల్లో కిరిబాటి, టోంగా సమోవా దీవులు ఉన్నాయి. ఇవి పసిఫిక్ మహాసముద్రంలో న్యూజిలాండ్‌కు చేరువలో ఉంటాయి. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఫిజి, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో నూతన సంవత్సర ఘడియలు ప్రవేశించాయి. 

కొత్త సంవత్సరం రోజున ముంబై నగరాన్ని పేల్చేస్తాం : అంగతకుడి హెచ్చరిక.. హైఅలెర్ట్ 
 
కొత్త సంవత్సరం రోజైన జనవరి ఒకటో తేదీన ముంబై మహానగరాన్ని బాంబులతో పేల్చివేస్తామని ముంబై నగర పోలీసులకు ఓ అగంతకుడు ఫోనులో హెచ్చరించాడు. న్యూ ఇయర్ రోజున వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు హెచ్చరించాడు. ఈ మేరకు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోను చేశాడు. దీంతో ముంబై నగర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించిన పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టారు. అయితే, ఇప్పటివరకు ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
 
కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ అగంతకుడు శనివారం సాయంత్రం 6 గంటలకు ఫోను చేసి బెదిరించాడు. న్యూ ఇయర్ రోజున వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగర వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు