ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం విఫలమైంది. హ్వాసాంగ్-12 అనే మధ్యంతర క్షిపణి తన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయిందని యూఎస్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ మేరకు డిప్లొమాట్ మేగజీన్ ప్రచురించిన కథనంలో.. గత ఏడాది ఏప్రిల్ 28న ఈ క్షిపణిని ప్రయోగించడం జరిగిందని.. కానీ ఈ క్షిపణి ప్రయోగించిన నిమిషం తర్వాత ఫస్ట్ స్టేజ్ ఇంజన్లు విఫలమయ్యాయని తెలిపింది.
ఇదిలా ఉంటే.. వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ కలకలం రేపుతోన్న ఉత్తర కొరియాపై ఆ దేశ పక్కదేశం దక్షిణ కొరియా కారాలు మిరియాలు నూరుతోంది. కొన్నిసార్లు ఉత్తరకొరియా భూభాగానికి దగ్గరలో దక్షిణ కొరియా బాంబులు కూడా వేసి యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు హెచ్చరికలు చేసింది. ఈ మధ్య ఇరు దేశాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ప్రతినిధులు ఈ నెల 9న సమావేశం కానున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరకొరియాకు చర్చల కోసం దక్షిణకొరియా చేసిన విజ్ఞప్తికి ఉత్తర కొరియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.