టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఆస్పత్రుల వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఇన్‌స్టా వేదికగా స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు. గురు పూర్ణిమ నాడు మొదలు పెట్టిన సాయిబాబా వ్రతాన్ని సెప్టెంబరు నాలుగో తేదీతో ముగించారు. వ్రతం పూర్తయిన సందర్భంగా షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకోనున్నారు.
'గురుపూర్ణిమ రోజు ప్రారంభమైన సాయిబాబా వ్రతం 9 వారాల ప్రయాణం శాంతి, నమ్మకంతో నడిచింది. నా సోదరితో కలిసి మొదలు పెట్టిన ఈ వ్రతంతో నేను అభిలషించిన దాని కన్నా ఎక్కువగా బాబా ఆశీస్సులు లభించాయి. నన్ను సదా రక్షిస్తున్న ఆ సాయిబాబాకు ధన్యవాదాలు. నా జీవిత కాలంలో వీలైనంత ఎక్కువమందికి సేవ చేస్తానని బాబాను ప్రార్థించాను. అత్తమ్మ కిచెన్ వినియోగదారులకు మీల్స్ అందిస్తాం.. జై సాయిరామ్'
చిన్నప్పటి నుంచే తనకు దైవం మీద ఎంతో భక్తి అని ఓ సందర్భంలో ఉపాసన చెప్పారు. సాయిబాబా వ్రతం చేయడం మొదలు పెట్టగానే సానుకూల ఆలోచనలు, పరిస్థితులు అలవడ్డాయని చెప్పారు. అత్యంత భక్తితో, నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం దక్కుతుందని ఉపాసన సహా సాయి భక్తుల విశ్వాసం. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, విజయం లభిస్తాయని, ఐశ్వర్యం, కుటుంబ శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.