భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తాం : పాకిస్థాన్

ఆదివారం, 14 జనవరి 2018 (13:41 IST)
తమ పాలకులు అనుమతిస్త భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేయనున్నట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ ఆసిఫ్‌ వెల్లడించారు. భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవల మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను పెంచుకుంటూ, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వం అనుమతిస్తే, తాము పాకిస్థాన్‌పై అణు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 
 
భారత ఆర్మీ చీఫ్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ తమను కవ్విస్తున్నాడని ఆరోపించిన ఆయన, అణు దాడికి భారత్ తమకు ఆహ్వానం పంపుతోందని అన్నారు. యుద్ధానికి కాలుదువ్వితే, తాము కూడా సిద్ధమేనని, భారత్‌పై తీవ్ర స్థాయిలో అణు బాంబులు వేయగల సత్తా తమకుందని ఆయన హెచ్చరించారు. 
 
మరోవైపు, భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో భాగంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణి అగ్ని-5ను పరీక్షించేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 18, 19 తేదీల్లో ఒక రోజున దీనిని పరీక్షించేందుకు వ్యూహాత్మక దళాల కమాండ్ సన్నాహాలు చేస్తోంది. పరీక్షకు అవసరమైన అన్నింటిని దాదాపు సిద్ధం చేశారు.
 
మొత్తం 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా తుత్తునియలు చేయగలదు. 1.5 టన్నుల వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఇది ఏక కాలంలో పలు లక్ష్యాలపై దాడి చేయగలదు. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా తన పనిని పూర్తి చేయగలదు. 
 
అగ్ని-5కు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండడంతో పరీక్షల నిమిత్తం ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ అగ్ని-5 పరీక్షతో పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పాక్‌ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తుండడంతో దాని వెన్నులో వణుకు మొదలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు