పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టీస్ నాసీరుల్ ముల్క్ నియమితులయ్యారు. ఆయన గురువారం తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే, పాకిస్థాన్‌కు తాత్కాలిక ప్రధానమంత్రి ఏంటి అనే కదా మీ సందేహం.
పాకిస్థాన్‌లో ప్రస్తుతం కొలువైవున్న ప్రభుత్వం పదవీకాలం ఈ గురువారంతో ముగియనుంది. దీంతో ప్రస్తుత ప్రధాని షాహిద్ ఖకన్ అబ్బాసీ దిగిపోవాల్సి వుంది. ఈ కారణంగా ఆ దేశానికి తాత్కాలిక ప్రధానిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే, జులై 25న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తాత్కాలిక ప్రధాని విషయంలో కొన్ని వారాలుగా అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్, ప్రతిపక్ష పాకిస్థాన పీపుల్స్ పార్టీ మధ్య వాదనలు జరిగాయి.
చివరకు మాజీ జస్టీస్ నాసీరుల్ ముల్క్ పేరును ఖరారు చేశారు. ముల్క్ పేరును వ్యతిరేకించే వాళ్లు ఎవరూ ఉండరనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, ఈయన పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి గతంలో తాత్కాలిక చీఫ్‌గా కూడా వ్యవహరించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం తాత్కాలిక ప్రధానికి ఉండదు.