పాకిస్థాన్‌తో ప్రపంచానికి ముప్పు పొంచివుందని యూఎస్ మాజీ సెనెటర్ లారీ ప్రెస్లర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తమ వద్ద ఉన్న అణ్వాయుధాలపై ఆ దేశానికి నియంత్రణ లేదని, ఇవి ఉగ్రవాదుల చేతుల్లోకి చేరిన మరుక్షణమే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ఉత్తర కొరియా కంటే పాకిస్థానే అత్యంత ప్రమాదకరమైనదన్నారు. అణుబాంబులను నియంత్రించే కేంద్రీకృత వ్యవస్థ ఆ దేశం వద్ద లేదన్నారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను దొంగిలించి ఇతర దేశాలకు, ఉగ్రవాదులకు అమ్ముకునే అవకాశం ఉందని... దీనివల్ల ప్రపంచానికే ప్రమాదం తలెత్తుతుందని హెచ్చరించారు.
ముఖ్యంగా, పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉగ్రవాదులు కొనుగోలు చేసే అవకాశం లేదా దొంగిలించే అవకాశం ఉందన్నారు. పైగా, ఆ ఆయుధాలను అమెరికా మీదే ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు. ఇది కేవలం అమెరికాను మాత్రమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని భయపెట్టే అంశమన్నారు. ఈ కారణాల వల్లే పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాల అమ్మకాలను అమెరికా ఆపేసిందని గుర్తు చేశారు.