అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్థాన్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడాన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఆయన ఎన్నిక దేశవిదేశాల్లోని భారతీయులకు సంతోషం కలిగిస్తుండగా పాకిస్థానీలకు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనికి పలు కారణాలు లేకపోలేదు.
ప్రధానంగా రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆయన కఠిన చర్యలు చేపడితే ఉగ్రవాదంపై పోరుకు అమెరికా నుంచి అందే సాయం పూర్తిగా ఆగిపోతుంది. పైపెచ్చు.. అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా భారత్కు అనుకూలంగా మారిపోతుందని పాక్ పాలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు ట్రంప్ యంత్రాంగంలో భారతీయ-అమెరికన్లకు పెద్దసంఖ్యలో చోటు దక్కబోతుందంటూ వస్తున్న వార్తలు మరింత వణికిస్తున్నాయి.
ఇమిగ్రేషన్ విధానాన్ని సంస్కరించేదాకా ఇతర దేశాల ముస్లింలను అమెరికాలోకి రాకుండా నిషేధిస్తానన్న ట్రంప్ మాటలు ముస్లిం దేశాలను ఇప్పటికీ భయపెడుతున్నాయి. పైగా యూరీ దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల విధ్వంసానికి భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడులను డోనాల్డ్ ట్రంప్ గట్టిగా సమర్థించారు. పైగా భారతలో ఆయనకు సొంత వ్యాపారాలున్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసిన పాక్ పాలకులకు వెన్నులో వణుకు పుడుతోందట.