ఈ క్షణమే జాదవ్‌ను ఉరితీసేలా ఆదేశాలివ్వండి : పాకిస్థాన్ సుప్రీంలో పిటీషన్

ఆదివారం, 28 మే 2017 (14:57 IST)
గూఢచర్యం ఆరోపణల కింద తమ వద్ద బందీగా ఉన్న భారత మాజీ నావికాధికారి కులభూషణ్ జాదవ్‌ను ఈ క్షణమే (సాధ్యమైనంత త్వరగా) ఉరి తీయాలని పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
 
నిజానికి జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. ఈ తీర్పుతో పాకిస్థాన్ పాలకులు షాక్‌కు గురయ్యారు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాదవ్‌ను తక్షణం ఉరితీసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, మాజీ సెనేట్ ఛైర్మన్ ఫరూక్ నయీక్ పేరిట న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
 
వెంటనే జాదవ్‌ను ఉరితీసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరగా, దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని 'డాన్' పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఎలాంటి తీర్పునిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

వెబ్దునియా పై చదవండి