2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మిషెల్ ఒబామా.. మిషెల్ 2020 పేరుతో హ్యాష్‌ట్యాగ్..

బుధవారం, 9 నవంబరు 2016 (16:23 IST)
అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో.. అమెరికా దేశ చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని ఆరాటపడిన హిల్లరీ క్లింటన్ కోరిక నెరవేరలేదు. అయితే 2020లో మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి మహిళా అధ్యక్షురాలిదే గెలుపు అంటూ అప్పుడే వార్తలొచ్చేశాయి.

2020 ఎన్నికల్లో పోటీ చేసే ఆ మహిళా అధ్యక్షురాలి అభ్యర్థి ఎవరో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్‌ ఒబామా. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా సతీమణి మిషెల్ ఒబామా పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. 
 
ప్రస్తుత ఎన్నికల ఘట్టంలో హిల్లరీకి ఆదరణ క్రమేణా తగ్గుతూ రావడం, ప్రచారంలో పాల్గొన్న మిషెల్‌ చక్కటి ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవడం గమనించిన కొందరు హిల్లరీని వదిలేసి మిషెల్‌నే భవిష్యత్ ఆశాదీపంగా భావించడం మొదలెట్టేశారు. డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఐదేళ్లు పాలించినా.. మిషెల్ కోసం అమెరికన్లు ఎదురుచూస్తున్నారు. వీరంతా ట్విట్టర్‌లో 'మిషెల్‌2020' పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ కూడా నిర్వహించారు.
 
ట్రంప్‌ ధోరణి నచ్చని వాళ్లు.. డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేక మిషెల్ ప్రస్తావనను తెరపైకి తెస్తుండగా, మరికొందరు.. సిన్సియర్‌గా ఆమె నాయకత్వాన్ని కోరుకుంటుంటే కొందరు మాత్రం సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
అయితే మాజీ అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో లైవ్‌ షోలో పాల్గొన్న తన సతీమణి మిషెల్‌ ఒబామాకు రాజకీయాలంటే ఆసక్తి లేదని తెలిపారు. సాధారణంగా అమెరికా అధ్యక్ష పదవికి రెండు సార్లు మాత్రమే అర్హులు. ఒకవేళ మూడోసారి కూడా అవకాశం ఉంటే మీరు పోటీ చేసేవారా అని కిమ్మెల్‌ అడగ్గా, తాను మళ్లీ పోటీ చేస్తే మిషల్‌ తనకు విడాకులు ఇచ్చి ఉండేదని, ఆమెకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి