సౌదీలో సంచలనం చోటు చేసుకుంది. మరణ శిక్షలు విధించే దేశంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన సౌదీ.. శిక్షలు విధించడంలో ఎలాంటి పక్షపాతమూ చూపదని కూడా ఇప్పుడు ప్రపంచానికి స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల్లో అరుదైన కేసుల్లో మాత్రమే విధించే మరణ శిక్షను సౌదీలో అతి తేలికగా విధిస్తూ ఉంటారు. ఇక, వివిధ దేశాల్లో మరణ శిక్ష అమలు కూడా అంత భయంకరంగా ఉండదు. కానీ, సౌదీలో మాత్రం అత్యంత భయంకరం. పబ్లిగ్గా వీటిని అమలు చేస్తుంటారు.
నాలుగు రోడ్ల కూడలిలో దోషులను కట్టేసి అందరి ముందే ఈ శిక్షలు విధిస్తుండడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. తాజాగా... సౌదీ రాజకుటుంబానికి చెందిన ఒక యువరాజుకు కొరడా దెబ్బలను శిక్షగా విధించారు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్డుల్లాజీజ్. అయితే అతడు ఏ నేరానికి పాల్పడ్డాడనే విషయం తెలియరాలేదు. వివిధ ఏజెన్సీలకు చెందిన ఐదుగురి సమక్షంలో ఈ శిక్షను విధించారని ఓకాజ్ డైలీ తెలిపింది.
ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించగా, అధికార ప్రతినిధి అందుబాటులో లేరు. ఇటీవలే సౌదీ ప్రభుత్వం ఓ యువరాజును ఉరితీసిన విషయం తెలిసిందే. తాజాగా ఇంకో యువరాజుకు కోరడాల శిక్ష విధించడం సంచలనంగా మారింది. శిక్ష పూర్తైన తర్వాత ఓ గదిలో పడేశారు.