పాకిస్థాన్ స్కాలర్‍షిప్ కుట్రను భగ్నం చేసిన భారత్

గురువారం, 11 జూన్ 2020 (17:52 IST)
స్కాలర్‌షిప్ ఆశలు చూపి పీఓకే‌లోని యువకులను తమవైపునకు తిప్పుకుని భారత్‌లోకి పంపించేందుకు పన్నిన కుట్రను భారత్ నిఘా విభాగం భగ్నం చేసింది. ముఖ్యంగా, ఉన్నత చదువులు చదివిన కాశ్మీరీ యువకులను స్కాలర్‌షిప్ రూపంలో తమవైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేసింది. ఈ కుట్రను భారత్ నిఘా వర్గాలు భగ్నం చేశాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉన్నత చదువుల నిమిత్తమై కాశ్మీరీ యువకులకు స్కాలర్ షిప్ రూపంలో తమవైపు తిప్పుకోవాలని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందించింది. 
 
అయితే ఈ ప్లాన్‌‌కు భారత్ భద్రతా బలగాలు అడ్డుకట్ట వేశాయి. ఇలా స్కాలర్‌షిప్‌ ఆశలు చూపి పీఓకేలోని యువకులను తమ వైపు తిప్పుకుని పీవోకే ప్రాంతాన్ని అస్థిరపరచాలని పాకిస్థాన్ వ్యూహం పన్నిందని భద్రతా బలగాలు తేల్చి చెబుతున్నాయి.  
 
అంతేకాకుండా పీవోకే ప్రాంతంలో తమ సానుభూతి పరులను పెంచుకోడానికే ఈ ప్లాన్ అని మండిపడుతున్నారు. 'యువ కాశ్మీరీలు తమ అధ్యయనం కోసం వాఘా - అత్తారి సరిహద్దు పోస్టు ద్వారా సరిహద్దు దాటి నియంత్రణ రేఖ ద్వారా... తిరిగి ఉగ్రవాదులుగా వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి' అని ఓ అధికారి తెలిపారు. 
 
1,600 రూపాయల స్కాలర్‌షిప్‌ను పీవోకే ప్రాంతంలోని యువకులకు అందివ్వాలని అక్కడి పార్లమెంట్ నుంచి కూడా ఆమోద ముద్ర లభించింది. అయితే గతం నుంచి కూడా పీవోకే యువకులకు పాక్ స్కాలర్‌షిప్పులను ప్రకటిస్తోంది. అయితే అవి తక్కువ రూపాయలతో కూడుకుని ఉండేవి. ఈసారి మాత్రం పారితోషకాన్ని పెంచారని అధికారులు పేర్కొన్నారు. 
 
దీంతో పాకిస్థాన్ ఇచ్చే ఉపకారవేతనం కోసం కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 150 మంది యువకులు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. 
అంతేకాకుండా వేర్పాటువాద గ్రూపులైన హురియత్ లాంటి వారి రికమండేషన్ పెట్టి మరీ అప్లై చేసినట్లు కశ్మీరీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
అలాగే.. ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న కుటుంబీకులకు చెందిన విద్యార్థులు.. అలాగే, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగితేలే కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు