'డోకా లా'లో డ్రాగన్‌కు చెక్.. అవసరమైతే యుద్ధానికి సై అంటున్న భారత్

సోమవారం, 10 జులై 2017 (11:22 IST)
సిక్కిం సరిహద్దు ప్రాంతం 'డోకా లో'లో భూభాగంలో చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్... ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనీ, అవసరమైతే యుద్ధానికి సిద్ధమని భారత్ సైన్యం తేల్చి చెప్పింది. దీంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 
 
వివాదాస్పద 'డోకా లా'లో ప్రాంతంలో టెంట్లు వేసుకొని సుదీర్ఘకాలం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంది. 'డోకా లా‌'లోని భారత సైన్యానికి అవసరమైన సరుకుల రవాణా సాఫీగా కొనసాగుతున్నదని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అదేసమయంలో సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొంటామని ధీమా వ్యక్తంచేశాయి. 
 
వెనక్కి తగ్గితేనే చర్చలు జరుపుతామన్న చైనా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనన్న గట్టి సంకేతాలు పంపినట్టయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దు సమస్యపై మరోవైపు చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాజీ ప్రసక్తే లేదని, బంతి భారత్ కోర్టులో ఉందని తేల్చి చెప్తున్నది. భారత్ తన సైన్యాన్ని వెనుకకు తీసుకుంటే తప్ప చర్చలకు తావు లేదని స్పష్టం చేస్తున్నది. 
 
నిజానికి భూటాన్‌కు చైనాతో ఎటువంటి సంబంధాలు లేవు. కానీ భారత్‌తో సఖ్యతగా ఉంటూ ద్వైపాక్షిక, రక్షణరంగ సహాయాన్ని పొందుతున్నది. ఇది చైనాకు కంటగింపుగా మారింది. సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 'డోకా లా' నుంచి వెనక్కి తగ్గకూడదని భారత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

వెబ్దునియా పై చదవండి