ఆర్థిక సంక్షోభం ముగిస్తే బెయిలవుట్ చర్చలు : ఐఎంఎఫ్‌

ఆదివారం, 10 జులై 2022 (14:40 IST)
శ్రీలంక దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ముగిస్తే ఆ దేశానికి రుణాలు ఇవ్వకుండా విధించిన బెయిలవుట్‌పై పునఃపరిశీలన చేసేందుకు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. 
 
పైగా, లంక రాజధాని కొలంబోలో తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. త్వరలోనే ఈ రాజకీయ సంక్షోభానికి పరిష్కారం లభించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. తద్వారా బెయిలవుట్‌ ప్యాకేజీపై నిలిచిపోయిన చర్చలు తిరిగి పునరుద్ధరించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. 
 
కాగా, ఇప్పటివరకు ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రధాని విక్రమసింఘేతో ఐఎంఎఫ్‌ తొలి దఫా చర్చలు జరిపింది. కొన్ని ఆర్థిక విధానాలపైన ఇరుపక్షాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. ఆగస్టులో పూర్తి స్థాయి ఒప్పందం ఖరారై బెయిలవుట్‌ ప్యాకేజీ మంజూరయ్యే అవకాశం ఉందని ప్రధాని ఇటీవలే ప్రకటించారు. 
 
ఈలోపే సంక్షోభం ముదిరి ప్రజాగ్రహం పెల్లుబికిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించారు. కొత్తవారు ఆ బాధ్యతల్లోకి వచ్చే వరకు సాంకేతికపరమైన చర్చల్ని ఆర్థిక శాఖలోని అధికారులతో కొనసాగిస్తామని ఐఎంఎఫ్ ప్రకటించింది. శ్రీలంకలో ఆగస్టు నెలలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు