ఆప్ఘనిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం, ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల పశ్చిమ కాబూల్‌లో ఎనిమిది మంది చిన్నారులు ఆకలితో చనిపోవడం దీన పరిస్థితులకు గుర్తు చేస్తోంది. దీంతో ఆప్ఘన్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఆకలి చావులను నిరోధించేందుకు గాను పనికి గోధుమల పంపిణీని ప్రారంభించింది. అంటే పని చేసిన వారికి వేతనం బదులుగా గోధుమలను పంపిణీ చేయనుంది.
ఈ మేరకు అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అధికారికంగా గోధుమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అఫ్గాన్ వ్యవసాయ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ రషీద్, కాబూల్ మేయర్ హమ్‌దుల్లా నొమాని తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాబూల్‌లోనే కాకుండా హెరాత్, జలాలాబాద్, కాందహార్, మజారే షరీఫ్ తదితర నగరాలు, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తాలిబన్లు తెలిపారు. అదేవిధంగా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు విస్తృతంగా కాలువల నిర్మాణం చేపడతామన్నారు.