ప్రపంచంలోనే తెలివైన విద్యార్థిని.. అసాధారణ ప్రతిభతో మెప్పించిన ఎన్ఆర్ఐ బాలిక

బుధవారం, 4 ఆగస్టు 2021 (08:38 IST)
ఓ ఎన్నారై బాలిక తన అసాధారణ ప్రతిభతో ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినిగా గుర్తింపు పొందింది. ఈ బాలిక తన తెలివి తేటలతో అమెరికా అగ్ర యూనివర్శిటీని మెప్పించి శభాష్ అనిపించుకుంది. ఆ బాలిక పేరు ప్రజ్ఞ. ప్రపంచంలోనే అత్యంత ప్రజ్ఞావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఎంపికైంది. 
 
న్యూజెర్సీలోని థెల్మా ఎల్‌ శాండ్‌మియర్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నటాషా పెరి(11) అనే విద్యార్థిని ఈ ఘనత సాధించింది. అమెరికాలోని కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించడానికి స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌(ఎస్‌ఏటీ), అమెరికన్‌ కాలేజ్‌ టెస్టింగ్‌(ఏసీటీ) అనే పరీక్షలు నిర్వహిస్తుంటారు. 
 
ఇందులో వచ్చిన స్కోరు ఆధారంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉపకారవేతనాలు కూడా ఇస్తుంటాయి. ప్రముఖ విశ్వవిద్యాలయం జాన్స్‌ హాప్కిన్స్‌ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌(సీటీవై) కూడా ఇదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయడానికి ఏటా పరీక్ష నిర్వహిస్తుంటుంది. 
 
ఇందులో హైస్కూల్‌ స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే అంశాలు ఉంటాయి. 2020-21కిగానూ 84 దేశాల నుంచి సుమారు 19 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలో పోటీపడ్డారు. వారిలో నటాషా 8వ గ్రేడ్‌ స్థాయిలో 90 శాతం మార్కులు సాధించి సత్తా చాటింది. 
 
మౌఖిక, రాత పరీక్షలు రెండింటిలోనూ అద్భుతమైన ప్రతిభ చూపింది. దీంతో ఆమె జాన్స్‌ హాప్కిన్స్‌ అందించే ‘హై ఆనర్‌ అవార్డ్స్‌’కు ఎంపికైంది. దీనిపై నటాషా ఆనందం వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు